నా ప్రేమ


అర్థం కాదు, అలా అని ఆగిపోదు..
కష్టం కాదు, కానీ సులభంగా దొరకదు..
యుద్ధం కాదు, అయినా ఓటమి తప్పదు..
విషం కాదు, ప్రాణం తీయడం ఆపదు..
పడితే లేవొచ్చు, పదే పదే పడేసే ప్రేమలో పడినా లేచినట్టే లేచినా పడినట్టే...!

వందేళ్ల జీవితానికి పునాది, పొరపాటు జరిగితే సమాధి..
క్షణమైనా మరిచిపోలేనిది, అదే క్షణంలో మారిపోయేది..
వింత వింతగా ఉంటుంది, వదిలి పొమ్మంటుంది..
వదిలేస్తే ఉండనంటుంది, వద్దకొస్తే వదిలేస్తుంది..
కష్టమొస్తే భయటపడొచ్చు కానీ, ప్రేమే కష్టమైతే కళ్ళు కన్నీళ్ళతో మనసు మాట్లాడలేని మౌనాలతో నిండిపోతుంది...!

చచ్చినా నీతోనే, వెంట వచ్చినా నీతోనే
వెంటపడినా కంటపడని కోపం నీతోనే...
కళ్ళు తెరిచినా నువ్వే, మూసినా నువ్వే
కన్నీరై నా కళ్ళని తడిపేది నువ్వే...
భాదైనా, ఏదైనా భారం మోసే ప్రాణం నువ్వే
నేడైనా రేపైనా ప్రాణం తీసే మోసం నువ్వే...
కళ్ళకొస్తే కనిపించదు, అది లోపం..
మనసుకొస్తే మన్నించదు, అది పాపం..
మనిషి కోరుకున్నదే జరిగితే దేవుడైనా మనిషిలా పుట్టాలనుకుంటాడు..!
మనసు కోరుకున్నది జరిగితే మనిషి కూడా దేవుడై పోతాడు..!

ఇది నిజం, ప్రేమించడం వరం.
ఇదే నిజం, ప్రేమించలేకపోవడం శాపం.
ఇది నిజం, ప్రేమని నమ్ముకుంటే జీవితం.
ఇదే నిజం, ప్రేమని నమ్మకపోవడమే మరణం.
ఇది నిజం, ప్రేమే జీవితానికి అర్థం.
ఇదే నిజం, ప్రేమ లేని జీవితం వ్యర్థం.
ప్రేమించడం అవసరం, అవసరాల కోసం ప్రేమించడం అనర్థకం..
ప్రేమ దక్కలేదని చావడం కన్నా, చచ్చేంతలా ప్రేమించడం ముఖ్యం...!

ఎన్ని మాటలు చెప్పినా, మాటలకందని భావం ప్రేమలో తెలుస్తుంది.
ఎంత ప్రేమ చూసినా, భావం తెలియని మౌనంలో మనసు తడుస్తుంది.
ఈ చావు పుట్టుకలతో అంతం కానిది, అద్భుతాలలో అంతుచిక్కనిది.
అటు చూస్తే ఇటు కనిపిస్తుంది, ఇటు వస్తే అటు వెళ్ళిపోతుంది.
రంగు రూపం తెలియదంటుంది, ఏ రంగులోనైనా తన రూపం మార్చనంటుంది.
అర్థం కాని చిక్కు ప్రశ్నలా ఎదురవుతుంది, అన్ని ప్రశ్నలకి సమాధానం తానేనంటుంది.

నాకూ అర్థం కాలేదనే చెబుతున్నా, ఇన్ని అర్థాలు వెతుకుతూ రాస్తున్నా.
మీకు అర్థమైనది చదువుకుని, మిగిలింది మరిచిపోండి.


" ధన్యవాదాలు "
                                                                                                                                        రచన
                                                                                                                                రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending