About

నా ఆలోచనలు

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు "

ఈ నా ఆలోచనలు అనే ఆలోచన వెనుక రచనలపై స్పూర్తిని కలుగజేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. మొదటగా నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులకి మరియు నాకు తెలుగు భాషపై ఉన్న మక్కువను గుర్తించి, నా తప్పులను సవరించి, నన్ను ప్రోత్సహించిన మా తెలుగు మాస్టారు " శ్రీ వేణుగోపాల్ గారికి " నా నమఃసుమాంజలి.

నా చిన్నతనం నుండి కథలు వినడం, చెప్పడం, సినిమా సంభాషణలు అనుసరించడం అలావాటుగా మారింది.
పరీక్షలలో ప్రశ్నలకి సమాధానాలతో పాటుగా సొంత కవిత్వాన్ని జోడించి వ్రాయడం మరియు ఏవైనా కథలు కాని చరిత్రకి సంబంధించిన విషయాన్ని వివరిస్తున్నప్పుడు వాటిని ఊహించుకుంటూ వినడం చేయడమనేది ఈ రోజు ప్రతీ విషయాన్ని కళ్ళకి కట్టినట్టుగా వివరించడంలో నాకెంతగానో ఉపయోగపడుతోంది. వీటన్నిటికన్నా నా మాటలపైనా, నా ఊహలపైనా ఎక్కువ ప్రభావం చూపింది మాత్రం మా అమ్మగారి చిన్నతనం నాటి విశేషాలను ఆమె మాటల్లో వివరించడమే. మా అమ్మ తరచుగా ఒక విషయాన్ని వివరిస్తున్నప్పుడు " ఆ.. అప్పుడు ఏం జరిగిందంటే " ఈ మాటని ఎక్కువ సార్లు వాడుతూ కథని ముందుకు తీసుకెళ్ళేది.

సినమా పాటలపై మక్కువ ఎక్కువగా ఉన్న రోజులవి, కాలేజీలో పుస్తకాలు చదవడం మానేసి పాటల పుస్తకాలు తెచ్చుకుని చదవడం, పిచ్చి రాగాలు తీయడం చేస్తూ ఒక పేరుని పదే పదే వింటూ వచ్చాను. ఆ పేరే నా పదాలకి, 
నా ప్రాసలకి ప్రేరణ. ఆ పేరే నాకు గురువు, ఆయన పాటలే నాకు అచ్చెరువు. రాగానికి తగ్గ సాహిత్యమివ్వడమే కాకుండా ఆ పాటలో పరవశింపచేయగల లాలిత్యాన్ని, పరమేశ్వరుణ్ణి చూడగల పరమార్థాన్ని జోడించి ప్రతీ మనస్సుని పది మార్లు పాట వినేలా చేయగల శక్తి ఉన్న వ్యక్తి. ఆయనే " పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు ".


ఏదైనా నేర్చుకోవాలి అంటే తపన ఉండాలి, తరగని కృషి తోడవ్వాలి. కాని, అవి రెండూ తప్ప మిగిలినవన్నీ ఎక్కువగా ప్రభావం చూపించడం నా జీవితంలో మొదలైంది. మాటలపై నియంత్రణ పూర్తిగా పోవడం, ప్రతి ఒక్కరి దగ్గర పాఠం నేర్చుకోవడం తప్పనిసరి అయ్యింది. ఇలా తప్పులు చేయడం కూడా తప్పకుండా ముఖ్యమే అనిపించేలా ప్రతి చోటా ఒక్కో రకమైన మనస్తత్వం గురించి తెలుసుకుంటూ వచ్చాను. నాకంటూ హద్దులు ఎర్పరుచుకున్నాను. మంచి మర్యాదలతో పాటు మనిషి మాటకి విలువనివ్వడం, ఇచ్చిన మాట మీద నిలబడడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. 

"మనకు విలువలేని చోట ఒక్క మాటైనా మాట్లాడకూడదు. అప్పటి మన మౌనమే మనకి విలువని తెచ్చిపెడుతుంది",

అని ఎక్కడో చదివాను దానిని నా జీవిత పాఠంగా మార్చుకుని ఈ రోజు ఈ " నేను నా ఆలోచనలు " అనే బ్లాగ్ ద్వారా నా అనుభవాలని మీతో పంచుకోవాలని వ్రాయడం మొదలుపెట్టాను. నా మాటలు ఎప్పుడైనా మీ భావాలని భాధపెడితే పెద్ద మనస్సుతో మన్నించి ఆదరిస్తారని నమ్ముతున్నాను. అడుగడుగునా నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిన, నాతో కలిసి నడుస్తున్న స్నేహితులకి నా కృతజ్ఞతలు. అలాగే, ప్రత్యక్షంగాను పరోక్షంగాను నా ఆలోచనలని ప్రభావితం చేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ..


ప్రేమతో
మీ
రెడ్డి ప్రసాద్ మల్లెల


Comments

Trending