నా గమ్యం
మనం నడిచే నేలకు ఆకర్షణ ఉంటుంది కానీ ఆధారం ఉండదు.
అలాగే, మన ఆశలకు అవసరం ఉంటుంది కానీ అంతం ఉండదు.
భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాను కదా, అని తన చుట్టూ తాను తిరగకపోతే తన స్థితిని కోల్పోతుంది. మనిషి తన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఆశలని అంతం చేయకపోతే తన మరణం కూడా ఒక అవసరంలా మారుతుంది.
గాలికి గమనం, జీవితానికి గమ్యం ఇవి తెలియకపోతే మనిషికి, దారం తెగిన గాలి పఠానికి వ్యత్యాసం ఉండదు. కారణం లేకుండా ఏ మనిషికి జననం లేదు, వచ్చిన పని పూర్తి కాకుండా మరణం రాదు. ఒక మంచివాడి పుట్టుక మంచిని పంచడం కోసం ఐతే, ఒక చెడ్డవాడి పుట్టుక మంచికి విలువను పెంచడం కోసం. రావణుడు రాక్షసుడు కానీ, రావనకాష్టం రాజైన రాముడిని దేవుడిని చేసింది లోకం తీరునే మార్చింది.
మనం నడిచే దారి చివరిలో గమ్యాన్ని వెతకడం, గమ్యం లేని ప్రయాణం చేయడం రెండూ సమానమే. ఓడిపోతామని దారిని, గెలవలేమని గమ్యాన్ని మార్చుకుంటూ పోతే జీవితం నేర్పిన గుణపాఠాలు తప్ప, చెప్పుకోగల గుణాలేవి కనిపించవు. జూదంలో ఓడినా, ధర్మరాజు తన ధర్మాన్ని తప్పలేదు కాబట్టి కురుక్షేత్రంలో గెలిచాడు రాజయ్యాడు. దుర్మార్గుడైన దుర్యోధనుడు దారి చూపిన వారిని కూడా ధర్మం తప్పేలా చేసాడు, దిక్కు లేని చావు చూసాడు.
గమ్యాన్ని తెలుసుకోవడం ముఖ్యం, గమ్యాన్ని చేరుకోవడం కష్టం.
గెలుపుని అందుకోవడం కష్టం, నిజమైన గెలుపుని తెలుసుకోవడం ముఖ్యం.
కానీ, గమ్యాన్ని ఎంచుకోవడం ఆ దారిలో వచ్చే గెలుపుని పంచుకోవడమే జీవితం.
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment