శిశిరం
కలలెన్నో..
నీతో చెప్పిన కథలెన్నో...
నీ కోసం వేచి చూసిన రోజులెన్నో...
ఒక్కో క్షణాన్ని లెక్కబెట్టుకుంటూ గడిపిన ఘడియలెన్నో...
నొప్పిని ఓర్చుకుంటూ, కన్నీటి వెనుక పడిన వేధనలెన్నో...
ఇన్ని ఉన్నా చెవికి వినపడిన నీ ఏడుపు నింపిన ఆనందం ముందు ఏదీ గుర్తు లేదు.
ప్రాణం పోసేందుకు ప్రాణం పోయేంత కష్టం పడినా,
పసినవ్వుల నిన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చింది.
కదిలితే కందిపోయే నీ పాదం నా గుండెలకు తాకగానే
నా జీవితం తరించిపోయింది.
రెప్పలు వేయకుండా రాత్రుళ్లు, వదిలిపోకుండా వందేళ్లు
కంటిపాపలా కాపాడుకుంటాను.
వెన్ను నిమిరి నిద్రపుచ్చే ప్రతి నిమిషం కల్మషం లేని నీ నవ్వులని,
నిదుర చెదిరి కలత చెందిన ప్రతి సమయం కన్నీటితో తడిచిన నీ బుగ్గలని,
పథిలంగా నా మనసులో దాచుకుంటాను..
పైకి చూసి నవ్విన ప్రతి క్షణం నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాను,
అల్లారు ముద్దుగా చూసుకునే మేనమామలతో ఆడి అలసిన క్షణం నేను ఊయలనవుతాను,
అమ్మమ్మ తాతయ్యల ఒడిలో ఒడిగిపోతే నన్ను మరువకుండా జోల పాడుతాను,
జన్మ రుణం తీర్చుకునే బంధంగా నీకు జన్మనిచ్చాను,
జన్మంతా గుర్తుండిపోయేలా కొత్త జీవితాన్ని ఇచ్చే శిశిరమై నువ్వు వచ్చావు..
సిరిలా చిరునవ్వుల వెన్నెల తెచ్చావు, చీకటిని కూడా మరిపించే నీ పాల పసిడి మెరుపులతో వెలుగును పంచావు. అడుగులు పడక ఆగిన ప్రయాణానికి కొత్త మజిలీవై, సరికొత్త దారిని చూపావు..
కళ్లారా నిన్ను చూసుకోవడం,
మనసారా మురిసిపోవడం,
మౌనంగా ఊసులాడటం,
చెరగని నీ చిరునవ్వులని చూస్తూ అలా నిలిచిపోవడం ఇదే ఇకపై
నా జీవితం..
ఇట్లు
అమితమైన ప్రేమతో
మీ అమ్మ..
Comments
Post a Comment