ఆ రాత్రి
తనేమందో అర్థంకాలేదు
తానెందుకు కాదందో తెలియలేదు
నవ్వుల వెలుగులతో నిండిన ఆ రాత్రి
తెల్లవారకుంటే బాగుండేది
క్షణం కూడా తనులేని సంతోషాన్ని ఊహించలేను
కదలకుండా నిలిచిపోయిన ప్రతిసారి
చిగురించిన తన చిరునవ్వులే జ్ఞాపకం
ఇప్పుడు కదిలి ఎంత దూరం వెళ్లినా
ఆ జ్ఞాపకాలకే పరిమితం
ఒంటరిగా మిగిలిన సమయం
అలల అలజడి లేని సముద్రంలా మౌనంగా ఉంది
కదలిక లేక కడలి కన్నీటితో కలిసిపోయింది
ఉవ్వెత్తున ఎగసిపడే గాలి తుంపర్లు తగిలిన జాడే తెలియదు
ఊపిరి పీల్చుకోవడం కూడా మరిచిన ఆలోచనలతో
ఉలిక్కిపడి నిద్రలేచి తలపైకి ఎత్తి చుక్కల వైపు చూస్తూ ఉండిపోయాను
వేల సంఖ్యలో ఉన్న చుక్కలకి చాలా దూరంగా ఉన్న చందమామ
తను లేని నాలా సగమే ఉంది
పాపం చందమామ కూడా నాలా ఒంటరిదే అనుకున్నాను
ఆ నడిరాత్రి నిలబడనివ్వని చలిగాలులు
వణుకు పుట్టించే వాతావరణం కానీ,
తన ఆలోచనలతో నాకు చెమటలు పడుతున్నాయి
ఊపిరి ఆడని ఉక్కపోతలా అనిపించింది
ఒక్క క్షణం శరీరమంతా వేడెక్కిన మంచు పలకలా మారింది
ఉషోదయం ఇక రాదని తెలుసు
ఈ చీకటితో స్నేహం తప్పదని తెలుసు
వెలుతురు కోసం వేంపర్లాడిన ఫలితం ఉండదు
కళ్ళు మూసి తెరిచాను తేడా తెలియలేదు
తెరిచి కనిపించకపోవడం కన్నా,
మూసిన కన్నులు తెరవకపోవడమే నయం అనిపించింది...
ఇది అనంతమైన శూన్యం
అలరించే ధ్వని ఏదీ వినిపించదు
అద్భుతం అనిపించేలా ఏదీ కనిపించదు
ఆనందం అనే మాట అక్కర్లేదు
దుఃఖించాల్సిన అవసరం లేదు
ఒడిదుడుకులు ఉండవు
ఆకలి కేకలు ఉండవు
అమ్మ ఒడిలో అలసటగా పడుకున్న పిల్లాడిలా
మర్చిపోలేని జ్ఞాపకాలని, గుర్తు వచ్చినా ఉపయోగం లేదనుకుని
అలా కన్నులు మూయాలి...
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment