అజ ( భాగం 4 )
అజ
( The UnBorn )
Part -4
అభివృద్ధిలో మానవుడు అంతరిక్షానికి చేరుకున్నాడు. అణ్వాయుధాలను కనుగొని యుద్ధాలను, శత్రువులను పెంచుకుంటూ సరిహద్దులను తెచ్చుకున్నాడు. గుండ్రంగా తిరిగే భూమికే స్థానభ్రంశం తప్పలేదు, అలాంటిది ఎలా పడితే అలా తిరిగే మనిషి ఆలోచనలు స్థాన భ్రంశం చెందడంలో ఆశ్చర్యం లేదు. ఆశ పడటం అవసరమే కానీ, అత్యాశతో అవసరాలను పెంచుకోవడం ప్రమాదం. అలా జరిగిన ప్రమాదాల ఫలితమే, చీకటి శక్తి మళ్లీ ప్రబళించి మానవాళి మనుగడకే ముప్పును తీసుకురానుంది. లోభం, మోసం, బానిసత్వం, మారణహోమం, విచక్షణ లేని ఆలోచన, విష వాయువులా మనిషిని పట్టి పీడించే స్వార్థం, గర్వం లాంటి మనిషి బలహీనతలే చీకటి శక్తి బయటకు రావడానికి ఉపయోగపడే మార్గాలు. మనిషి అంతరిక్షంలోకి వెళ్లడం, పక్క గ్రహాల మీద నివాసం ఏర్పరుచుకోవడం విజయమని భావిస్తూ, భూగ్రహాన్ని కాపాడుకోలేక పోవడం తన వైఫల్యమని తెలుసుకోలేకపోతున్నాడు. ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో తెలియక బిక్కు బిక్కుమంటూ, ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలోనే జీవితం తెలియకుండానే గడిచిపోతుంది. ప్రకృతిని పాడుచేసి, ప్రత్యామ్నాయం గురించి ఆలోచించిన ప్రతీ సారి ప్రాణాలను కాపాడుకునే అవకాశాన్ని తగ్గించుకుంటూ పోతున్నాడు. ఇలాంటి అంతుచిక్కని అత్యవసర పరిస్తితులే ఈ యోధుల మళ్ళీ జన్మించడానికి కారణంగా మారుతున్నాయి.
శరీరాలను వదిలి ఈ విశ్వంలోని పంచభూతాలని ఆవరించి, పెను ప్రమాదాల నుండి మానవాళిని రక్షిస్తూ ఉన్నారు. కానీ, అవసరం కాస్త అత్యవసరంగా మారింది. పరోక్షంగా చేసే ఏ సాయం ఇక ఆ చీకటి శక్తిని అంతం చేయడం కానీ, అదుపు చేయడం కానీ చేయలేదు. అందుకే ఈ ఏడుగురు మహాయోధుల జననం తప్పనిసరి అయ్యింది. ప్రత్యక్షంగా వీరు చేసే సహాయం అనివార్యమైంది. కానీ, ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ అజాలకు జనన,మరణాల అవకాశం ఉండదు. వారి శక్తిని తట్టుకోగల శరీరాలను ఎంచుకుని వాటిలో ప్రవేశించడమే ఉన్న ఒకే ఒక్క దారి. ఇది మంత్రమో, తంత్రమో కాదు మనం నమ్మే సైన్స్ కూడా దీని గురించి వివరిస్తుంది. మనిషి శరీరం కేవలం రక్తమాంసాల సమాహారమే, ఆత్మ ప్రధానమైన శక్తి అని. అలాగే, ఈ అజాలు కూడా ఆత్మ వదిలిన శరీరాలని ఎంచుకుని వాటిలో చేరడం తప్పనిసరి అయ్యింది.
కొన్ని లక్షల కాంతి సంవత్సరాలుగా కాలంలో ప్రయాణం చేస్తూ వీరు సాధించిన శక్తి యుక్తులకు సరిపడే శరీరాన్ని వెతకడం కష్టతరం కావున, పుట్టి పుట్టగానే మరణించిన పసి శరీరాలని ఎంచుకోవడం శులభమైన పని. కానీ, ఈ ఏడుగురు మహాయోధుల వయసులో కాని, శక్తిలో కాని వ్యత్యాసం ఉండదు అందుకే ఒకే రోజు ఒకే సమయంలో పుట్టి మరణించే ఏడుగురు పసి పిల్లల కోసం వెతుకులాట మొదలైంది. సృష్టిలో జననం,మరణం ఒకే సమయంలో జరగడం సహజమే కానీ, పుట్టి పుట్టగానే ఒకే సమయంలో మరణించడం అనేది ఎప్పుడూ జరిగి ఉండదేమో. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం, అవరోధాలని దాటి ముందుకు వెళ్ళండం వీరుల లక్షణం. అందుకే ప్రపంచంలోని అన్ని ప్రదేశాలని అణువణువు గాలించడం మొదలుపెట్టారు. పసిపిల్లల ఏడుపు వినిపించే ప్రతీ ప్రదేశానికి వెళ్లారు కానీ, ప్రయోజనం లేకపోయింది. ఎక్కడా ఏడు మంది పిల్లలు ఒకే సారి పుట్టడం కూడా చూడలేకపోయారు. దానితో నిర్ణయించుకున్నారు కలిసి వెతకడం కన్నా ఒక్కొక్కరూ ఒక్కో దిక్కుకు వెళ్లి వెతకడం ఫలితాన్ని ఇస్తుందని భావించి వేరు వేరు ప్రదేశాలకు ప్రాయాణించడాన్ని ఎంచ్చకున్నారు. కొన్ని నెలల పాటు ప్రపంచాన్ని చుట్టేస్తూనే ఉన్నా అలాంటి శరీరాలు వారికి ఎక్కడా కనిపించలేదు. లాభం లేదని గ్రహించి వారి శక్తులని ఏకం చేసి వారు ప్రవేశించడానికి అనువైన శరీరాలని ప్రసాదించమని ప్రకృతిని ప్రార్థించారు. వారి కోరికని మన్నించడం సృష్టి విరుద్ధమే అయినా లోక రక్షణ కోసం వారి జననం అనివార్యం కావడం వలన, వారి కోరిక మేరకు యోధుల శక్తి సామర్ధ్యాలకు అనువైన శరీరాలతో పుట్టబోయే వారి జన్మ వివరాలను తెలిపింది.
ఏడు అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు, సృష్టి రహస్యమే అందులో ఉంది. ఏడు ఖండాలు, ఏడు అద్భుతాలు, ఏడు రంగులు ఇలా చెప్పుకుంటూ పోతే ఏడు జన్మల మనిషి జీవన ప్రయాణం మొత్తం ఇందులోనే ఇమిడి ఉంది. అలాంటి ఏడుగురు మహాయోధులు ఒకే సమయంలో శరీరాలని ఎంచుకుని జన్మించడం అనేది ఒక అద్భుతమనే చెప్పాలి. ఏడుగురూ వారి వారి శరీరాలని సమీపించి పసి ప్రాణాలు, శరీరాలను విడిచే క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఒక్క సారి అందరూ కళ్ళు మూసుకుని తమ శక్తులని ఏకం చేస్తూ ఒక ప్రదేశాన్ని ఎంచుకుని వారి జ్ఞాపకాలని, వారి పూర్తి శక్తులని తిరిగిపొందే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క సారి శరీరంలోకి ప్రవేశించాక వారి గత జన్మల జ్ఞాపకాలేవి వారికి గుర్తు ఉండవు కనుక లక్ష్యమే వారిని మళ్లీ వారు ఏర్పరుచుకున్న మార్గం వైపు నడిపిస్తుందని నమ్మకంతో వారి శక్తులని మానవ మాత్రులు చేరుకోలేని విధంగా మార్చుకున్నారు. ఎక్కడ ఉన్నా ఒకే ఆలోచన, ఒకే మనస్తత్వం కలిగి ఉండటం వీరికున్న బలం. శక్తులు వేరైనా సామర్ధ్యం ఒక్కటే, వెళ్ళే దారులు వేరైనా వీరి గమ్యం మాత్రం ఎప్పుడూ ఒక్కటే. ఈ ఎకత్వమనే భావనే వీరిని మళ్ళీ ఒకే తాటిపై నడిపే సాధనం. సమయం సమీపించింది, ఏడుగురు యోధులూ క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా మరణించారని నిర్ధారించిన మారు క్షణమే ఆ శరీరాలలో ఆవరించి మళ్లీ ఈ లోక రక్షణార్థం జన్మించారు..!
....? ఈ యోధులు ఎక్కడ జన్మించారు? వారి శక్తులని ఎక్కడ దాచి ఉంచారు? మళ్లీ వీరు ఎప్పుడు కలుసుకుంటారు? వీరికున్న శక్తులంటి అనే విషయాలను ముందు ముందు వివరించడానికి ప్రయత్నిస్తాను.
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
ముందు భాగం తరువాయి భాగం
Comments
Post a Comment