అజ ( 3వ భాగం )
అజ
( The UnBorn )
Part - 3
చీకటి, దీనినే శూన్యం అని కూడా పిలుస్తాం. ఈ విశ్వంలో తలెత్తే ప్రతీ ప్రశ్నకి ఇందులోనే సమాధానం దొరుకుతుంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మనకు తెలిసిన 2D, 3D పరిమాణాలలాగే
(Dimensions) మన విశ్వంలో మనకి తెలియని చాలా పరిమాణాలు ఉన్నాయి, అందులో "0D" Zero Dimension కూడా ఒకటి. మన ఆలోచనలని అదుపు చేసుకోవడం ద్వారా మనం ఇలా వివిధ రకాల పరిమాణాలని చేరుకోవచ్చు. ఇప్పుడు అతను చేరుకున్న ఈ చీకటి ప్రదేశం కూడా అతని ప్రశ్నలకి సమాదానం దొరికే చోటు. చెవులు పగిలిపోయేలా వినిపించే ఆ చిన్న పిల్లాడి ఏడుపు ఉన్నట్టుండి ఆగిపోయింది. రకరకాల శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి, ఎవరో అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం అర్థమైంది. అతనికి వినిపించే ప్రతి మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
" డాక్టర్, డాక్టర్ చనిపోయాడనుకున్న బాబు బ్రతికాడు "
" అరే చిన్ని నాన్న, నువ్వు పెద్దయ్యాక పెద్ద సూపర్ హీరో అవ్వాలి రా..."
" భూమి గుండ్రంగా ఉండటానికి కారణం దాని Dimension, భూమి మీద ఉన్న అన్ని వస్తువులూ 3 Dimension లోనే ఉంటాయి. "
" వీడికి ఫిజిక్స్ లో తప్ప అన్నింటిలో పాస్ మార్క్స్ మాత్రమె ఎందుకు వస్తున్నాయి "
" ఎవరైనా ఏ డాక్టర్ లేదా ఇంజనీర్ అయ్యి అమెరికా వెళ్లాలని అనుకుంటారు. కానీ, నువ్వేంటి వేరే లోకాలని వెతుకుతూ వెల్తానంటున్నావ్ "
" విశ్వక్, I love you "
" please నన్ను వదిలి వెళ్ళకు "
" విశ్వక్ ఆగు, తిరిగి రా.... విశ్వక్...... "
ఆ మాటలన్నీ ఒక్కొకటిగా అతని గతాన్ని అతనికి గుర్తు చేస్తున్నాయి.
తనెవరో తాను తెలుసుకునే ప్రయత్నంలో ఉండగానే, తనకు ఎర్రటి కన్ను లాంటి కాంతి ఒకటి కనిపించడం గమనించాడు. అది మినుగురులా వెలుగుతోంది. ఒకటి కాస్త రెండుగా మారింది. రెండు నాలుగైంది. నాలుగు,ఎనిమిది, ఇలా పెరుగుతూ పెరుగుతూ ఆ చీకటి మొత్తం ఎర్రటి కళ్ళతో తనని చూస్తున్నట్టుగా అనిపించింది. గుండెల్లో భయం మొదలైంది, రెప్ప వేసి తెరిచినట్టుగా ఆ ఎర్రటి కళ్ళు, ఒక వికృతమైన రూపంలా మారి అతనిపై విరుచుకుపడే ప్రయత్నం చేసింది. అప్పుడే తన ఆలోచనలు ఒక్కొక్కటిగా తనని తాను తెలుసుకునే దారిలో పడ్డాయి. ఒక్క క్షణం తన స్నేహితుడు చెప్పిన మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి " చీకటికి భయపడితే, వెలుగును ఎప్పటికీ చూడలేం ". ఈ మాటలు వినపడగానే అతను మరిచిపోయిన శక్తులన్నీ అతనికి జ్ఞాపకం వచ్చాయి. క్షణం ఆలస్యం చేయకుండా అతని ఆయుధాన్ని తలుచుకున్నాడు. తలచిన మరు క్షణం ఆ ఆయుధం ఆ చీకటి వికృత రూపానికి అడ్డుగా నిలబడి, ఆ చీకటి కన్నులని ముక్కలుగా చేసి, అతని చేతిలో వచ్చి నిలిచింది. చుట్టూ ఉన్న చీకటి మెల్లిగా విడిపోయి, నల్లని చిన్న ముద్దలా మారి నేలపై పడి అలాగే భూమిలోకి ఇంకిపోయింది.
అతనికి తెలుసు అనుకున్నంత సులభంగా ఆ చీకటి శక్తిని అతను ఓడించలేదని. కానీ, ఆ భయం నుండి బయటపడ్డానన్న సంతోషం అతనికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.
ఇక్కడికి రావడానికి గల కారణం జ్ఞాపకం వచ్చింది. అతను వచ్చింది మరెవరికోసమో కాదు, అక్కడి రాక్షసత్వపు బానిసత్వానికి, బందీలుగా ఉంటున్న తన సైన్యాన్ని విడిపించి తీసుకెళ్లడానికి.
ఆశ్చర్యంగా ఉందా?? అవును అతను ఒక యోధుడు. ఈ ప్రపంచాన్ని రాక్షస శక్తుల నుండి కాపాడేందుకు ఎన్నుకోబడిన వాడు. ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైన అగ్నిని, అన్నింటి కన్నా వేగవంతమైన గాలిని ఒకే సారి ప్రయోగించగలిగిన వీరుడు. కొన్ని వేల కాంతి సంవత్సరాల క్రితం జరిగిన ఘోరమైన యుద్ధంలో చీకటి శక్తిని ఓడించి, కాల గమనంలో కనిపించకుండా ఈ భూమి నుండి దూరంగా అంతః పాతాళానికి అణిచివేసిన వీరులలో ఇతనూ ఒకడు. వీరిని "అజా" అని పిలుస్తారు అంటే పుట్టుక కానీ, మరణం కానీ లేని వారని అర్థం.
ఇతనితో పాటుగా మరో ఆరుగురు మహా యోధులు మరియు 7 లక్షల మంది సైన్యం కలిసి చేసిన యుద్ధంలో, చీకటి ఆకలికి వీరి సైన్యం బానిసలుగా మారి భందింపబడ్డారు. మిగిలిన ఈ 7 గురు మహా యోధులు వారి శక్తులన్నీ ఒక్కటి చేసి చీకటిని మళ్లీ తిరిగి రాలేని అంతః పాతాళానికి అణిచివేశారు. ఈ ప్రయత్నంలో వారి శరీరాలను కూడా పణంగా పెట్టాల్సి వచ్చింది. రూపాన్ని విడిచినా వారి లక్ష్యాన్ని మాత్రం విడువలేదు. అణిచివేయబడిన చీకటి తలుపులు తెరిచి విరుచుకు పడిన ప్రతీ సారి, మానవాళి జీవనానికి ఎటువంటి నష్టం తలెత్తకుండా ఈ భూమిని కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ, చీకటి లోకపు ఆశలకు బానిసలై అడుగడుగునా అంతు లేని దుఃఖానికి బలి అవుతున్న మానవాళిని కాపాడేందుకు మళ్లీ తిరిగి వచ్చారు. వీరి శక్తి అనంతం, వీరి ఆలోచనల బలం ప్రత్యేకం, సామాన్య మానవుడికి సాధ్యం కానీ ఎన్నో వింతలని, విషయాలని కళ్ల ముందు ఉంచగల సామర్ధ్యం వీరిది.
సృష్టిలోని ఏ పరిమాణంలోనైనా ప్రవేశించగలరు, ఏ కాలానికైనా ప్రయాణించగలరు. వీరికి అర్థం కాని విషయం మరియు అంతు చిక్కని సమస్య కానీ ఉండదు.
..................ఇంతటి శక్తివంతమైన వీరులు ఎవరు?? పుట్టుక, మరణం లేని వీరి జననం ఎలా జరిగింది అనే విషయాన్ని మరియు ఒక్కొక్కరి శక్తి, సామర్త్యాల వివరాలని రేపటి భాగంలో వివరించే ప్రయత్నం చేస్తాను.
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment