అజ ( 2వ భాగం )

అజ 

( The UnBorn )
Part - 2

                                అతను ఇంతటి విచిత్రమైన ప్రదేశాన్ని చూడటం ఇదే మొదటి సారి. తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఎలా వచ్చాడో అనే ప్రశ్నలకు ఎంత ఆలోచించినా సమాధానం అంతు చిక్కడం లేదు. ఆలోచనలకు అందని మాయాలోకం ఇది, ఇక్కడ ఆలోచించడం కూడా వృధా ప్రయాసే అని చెప్పాలి. కానీ, బయటపడే మార్గం తెలుసుకోలేకపోతే మిగిలిన వారిలాగే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మళ్ళీ సూర్యోదయం అవ్వగానే ఈ వెలుతురు వెళ్ళిపోతుంది, చీకటి అలుముకున్న సూర్యుడు వెంటపడే నీడలా దారిని కనిపించనీయకుండా కప్పేస్తాడు. బానిసత్వపు సంకెళ్లు ఇక్కడ ఉన్న వారికి మళ్ళీ కానుకలా తిరిగి వచ్చేస్తాయి. సమయాన్ని వృధా చేయాలని అస్సలు అనుకోవడం లేదు. ఆ వెలుతురు ఉన్నంత వరకూ వెతుకుతూ బయలుదేరాడు. అడుగులు పడుతున్న ప్రతీ చోటుకి దీపపు వెలుగులు వెంటపడుతున్నాయి. అతనికి అణువంత అవకాశం కూడా కనిపించడం లేదు. కానీ, అతనికి ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం మాత్రం అతను ఇది వరకే ఈ ప్రదేశానికి వచ్చినట్లుగా అన్నింటినీ ఇంతకు ముందే చూసినట్టుగా అనిపించడం. అతనిలో ఆతృత పెరిగింది...

ఎక్కడినుండో సముద్రపు అలలు ఎగసిపడుతున్నట్టుగా శబ్దం వినిపించడం మొదలైంది. కానీ, అక్కడ ఎలాంటి నీటి జాడ కనిపించడం లేదు. ముందుకు వెళుతున్న కొద్దీ శబ్దం పెరుగుతోంది తప్ప సముద్రం కనిపించడం లేదు. తరువాత తను వేసిన అడుగు మాత్రం అతనిలో చచ్చే భయాన్ని రేపింది. వేసిన అడుగుని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెనక్కి తీసుకుని కిందకి చూసాడు, తన కాలికి తడి అంటుకుని ఉంది. అనుమానంగా మళ్ళీ ఇంకొకసారి అడుగు పెట్టి చూసాడు, మళ్ళీ తడి తగలడం మొదలైంది. ఇంకొక అడుగు ముందుకు వేసే ధైర్యం చేసాడు ఉన్నపాటుగా అలలో చిక్కుకున్నట్టుగా కాలు జారి నీళ్లలో పడ్డాడు. అయినా అతని కళ్ళకి మాత్రం ఎలాంటి నీరు కనిపించడం లేదు. భయం మొదలైంది, ఉన్నపాటుగా అక్కడ నుండి వెనుకకి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ, ఇంకా నీటి లోపల నడుస్తున్నట్టే ఉంది. అతను నీటి నుండి దూరంగా వెళుతున్నాడో, నీటి మధ్యలోకి వెళుతున్నాడో కూడా అర్థం కావడం లేదు. భయంతో కేకలు పెడుతున్నా కాపాడే వాడు ఎవ్వరూ లేకపోయారు. అడుగు ముందుకు వేయకుండా ఉన్నచోటే నిలబడి గట్టిగా ఊపిరి పీల్చుకుని అటూ ఇటూ చూస్తున్నాడు. ఇంతలో సూర్యోదయం అయ్యే సమయం రానే వచ్చింది. అలల శబ్దం మెల్లిగా తగ్గడం మొదలైంది, నీరు తన నుండి దూరంగా వెళుతుండడం అతనికి తెలుస్తోంది. కొద్దిసేపటికి పూర్తి సూర్యోదయం అయ్యింది, మళ్లీ చీకటి వచ్చి చేరింది. దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతూ వచ్చాయి, కన్నె పిల్లలు కొద్ది కొద్దిగా కనుమరుగైపోతున్నారు, మద్యం ఆవిరైపోయింది, బానిసల రక్తపు మరకలతో నేల తడవడం మొదలైంది, సంకెళ్లు వచ్చి పడ్డాయి. అతనికి మాత్రం దానిని ఎలా అర్థం చేసుకోవాలో పాలు పోవడం లేదు. 

బానిసల వైపు జాలిగా చూస్తూ, తన ఈ పరీస్థితికి భాదపడుతూ ఒక చోట కూర్చున్నాడు. ఆకలి వేయడం లేదు, ఊపిరి పీల్చుకుంటున్న భావన కూడా కలగడం లేదు, చేతులని పరీక్షగా చూసాడు అతనిలో ఎలాంటి మార్పు లేదు. కానీ, అతనికి సంబందించిన ఎలాంటి జ్ఞాపకం తనకి ఎందుకు గుర్తు రావడం లేదో కూడా తెలియని అయోమయంలో ఉన్నాడు. ఆ క్షణంలో అకస్మాత్తుగా, ఆకాశం నుండి ఒక అగ్ని గోళం వచ్చి అతనికి సమీపంలో పడింది. అది అతను ఊహించనిది. బానిసల అరుపులు ఉన్నపాటుగా పది రెట్లు ఎక్కువగా వినిపించడం మొదలైంది. తల పైకెత్తి చూసాడు, కొన్ని వందల అగ్ని గోళాలు అమాంతం ఆ ప్రదేశంలో పడటం, అక్కడ ఉన్న వారి శరీరాలకు తగలగానే చిత్తుగా విరిగిపోతున్న ఎముకల శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. మంటల మధ్యలో విరిగి పడి కాలిపోతున్న శరీర భాగాలు, ఆ భాదతో రోదిస్తూ బానిసలు పెట్టే ఆ కేకలు అతనికి నిజమైన నరకాన్ని చూస్తున్నానా అనిపించింది. అతనిపై మాత్రం చిన్న గీత కూడా పడలేదు, మిగిలిన వారిని కాపాడాలని ప్రయత్నించినా అతని శరీరం సహకరించడం లేదు, వారిని తాకడం కూడా కుదరడం లేదు. ఇంతటి ఘోరమైన సంఘటనను చూసినా అతని కళ్ల నుండి కన్నీరు రావడం లేదు, కళ్ళు రెప్ప వేయడం లేదు. కొద్దిసేపటికి ఆ అగ్ని గోళాలు పడటం ఆగిపోయింది, మళ్లీ ఎవరి దేహాలు వారి ఎదా స్థితికి వచ్చేసాయి. 

ఇదెంతటి ప్రమాదకరమైన ప్రదేశమో స్పష్టంగా అర్ధమైంది. క్షణమైనా ఆలస్యం చేయకుండా ఇక్కడి నుండి బయట పడాలనుకున్నాడు. ఏ మార్గం తెలియాలన్నా అతనికి తన గురించి తెలియడం తప్పనిసరి అని అర్థమవుతుంది. కొద్ది సమయానికి సూర్యాస్తమయం అవ్వడం దగ్గర పడింది. గట్టిగా నిర్ణయించుకున్నాడు, ఈ రోజు ఎలాగైనా తన గురించి తెలుసుకోవడానికి కావాల్సిన దారిని కనిపెడుతానని. కానీ, లోపల భయం వెంటాడుతూనే ఉంది. వేసే ప్రతీ అడుగుని జాగ్రత్తగా ఆలోచించి వేస్తూ ముందుకు వెళుతున్నాడు. నడిచే దారి దీపాల వెలుగులతో నిండిపోయింది. కళ్ళకి కనిపిస్తున్నదేది నిజం కాదని, నిజం ఇంకేదో ఉందన్న విషయం నిన్నటి రాత్రి బాగానే అర్ధమైంది అందుకే ఈ రోజు కళ్ళను కాకుండా తన ఆలోచనలకు మరియు మనసుకు పని పెట్టాడు. కొద్ది దూరం నడిచాక, కళ్లెదుట దారి స్పష్టంగా కనిపిస్తున్నా అడుగు ముందుకు పడటం లేదు, ఏదో అడ్డుకుంటునట్టే ఉంది. ఇదేదో మాయలా అనిపించింది తన శక్తినంతా కూడగట్టుకొని బలంగా పిడికిలి బిగించి బద్దలు కొట్టడం మొదలుపెట్టాడు. కొట్టిన ప్రతీ దెబ్బకీ రెండింతల బలం చేర్చి కొట్టడం కొనసాగించాడు. అతనికి వెనుక నుండి బానిసలు చేసే కేరింతల చప్పుళ్ళు వినిపించక మానలేదు. కానీ, అతని శక్తిని, ఏకాగ్రతని రెండింటిని కలిపి ఎదురుగా ఉన్న అడ్డుపై బలంగా లాగి కొట్టాడు. బళ్ళున అద్దం విరిగినట్టుగా చప్పుడు, అర్ధం కాలేదు చేతితో తాకడానికి ప్రయత్నించాడు అడ్డుగా ఏమీ ఉన్నట్లు అనిపించలేదు. మెల్లిగా తన అడుగు తీసి ముందుకు వేశాడు. అడుగు పడగానే ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినిపించడం మొదలైంది వెంటనే భయంతో అడుగు వెనుకకి తీయగానే ఆ ఏడుపు ఆగిపోయింది. 

అసలా ఏడుపు ఎవరిదో తెలుసుకోవాలని ధైర్యం తెచ్చుకొని అడుగు ముందుకు వేశాడు, అడుగులు ముందుకు పడే కొద్దీ చిన్న పిల్లాడి ఏడుపు ఎక్కువ అవ్వడం మొదలైంది. వెలుగు వెంటపడటం ఆగిపోయింది, బానిసల అరుపులు వినపడటం ఆగిపోయింది ఒక్క పిల్లాడి ఏడుపు మాత్రమే వినిపిస్తోంది. అడుగులు పడటం కూడా తెలియని చీకటి, అసలేమిటో అర్థం కాని ఏడుపు తప్ప వేరే ఏదీ తెలియడం లేదు. చెవులు పగిలిపోయేంతగా, తల బద్దలయ్యే౦తగా  ఏడుపు మాత్రమే వినిపిస్తోంది. 

............. ఇంతకీ ఆ ఏడుపు ఎవరిది?, అది అతనికి ఎందుకు వినపడుతోంది? అనే విషయాన్ని మరియు ఆ వింత ప్రదేశపు విచిత్రాలని..! రేపటి భాగంలో వివరించే ప్రయత్నం చేస్తాను.

" ధన్యవాదాలు "
                                                                                                                                      రచన
                                                                                                                              రెడ్డి ప్రసాద్ మల్లెల


Comments

Trending