అజ

  అజ   

( The UnBorn )

                     అనగా అనగా అని చెప్పుకునే ఒక కథ కాదు. వేదన, ఇది హృదయాన్ని కదిలించే ఘోరమైన వేదన. ప్రపంచం అంతరించి పోవడాన్ని తలుచుకుంటే వణుకు పుట్టే ఈ సమాజానికి విరుద్ధంగా ఆ వినాశనాన్ని నిత్యం కోరుకుంటున్న ప్రదేశం అది. పగలంతా చీకటిలో బ్రతికే వీరు రాత్రంతా అంతులేని కాంతిని చూస్తారు. ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా..! అవును, నిజం ఈ ప్రదేశంలో సూర్యుడు నల్లని మబ్బులా రాక్షసత్వపు బానిస బ్రతుకులకు సాక్ష్యంగా ఉంటాడు. వీరు మనం ప్రస్తుతం ఉంటున్న కాలానికి, కోరికలకి పూర్తి భిన్నంగా ఉంటారు. 

మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే వీరు మనుషులు కాదు, అలా అని మనలా కనిపించరని కూడా కాదు. వీరికి కూడా మనలాగే అన్ని అవయవాలు ఒకేలా పని చేస్తాయి, నిజం చెప్పాలంటే వీరి మెదడు మనకన్నా 25% ఎక్కువ వేగంగా పని చేస్తుంది. వీరికి మనలా ఎటువంటి అంగ వైకల్యాలు ఉండవు. వయసు పెరగదు, మరణం రాదు. ఇదే వీరికి ఉన్న పెద్ద శాపం. అందుకే, ఇక్కడి వారు ప్రపంచం ఎప్పుడు నాశనం అవుతుందా అని ఆరాటపడుతుంటారు.

స్నేహం, శత్రుత్వం వీరికి తెలియదు కేవలం బానిసత్వం మాత్రమే తెలుసు. సూర్యుడు అస్తమించడంతో వీరికి రోజు మొదలవుతుంది. వారి చేతికి ఉన్న సంకెళ్ళు విడిపోతాయి, అప్పటి వరకూ నల్లని మబ్బులా ఉన్న ప్రదేశం ఉనట్టుండి దీపాల వెలుగులతో నిండిపోతుంది. అందమా?, అద్భుతమా! అనిపించేలా అతిలోకసుందరులు వీరి ముందు ప్రత్యక్షమవుతారు, మద్యం ఏరులై పారుతుంది. రాత్రంతా కామ, క్రోదాలతో, సరస సల్లాపాలలో అనుభవిస్తూ ఒకరితో ఒకరు గొడవలు పడుతూ, రక్తాలు కారిపోతున్నా రాక్షసుల్లా నవ్వుకుంటూ బ్రతికేస్తారు. మళ్ళీ సూర్యుడు ఉదయించగానే మద్యం ఆవిరైపోతుంది, ఆడపిల్లలు అదృశ్యమైపోతారు, విడిపోయిన సంకెళ్ళు వాటంతట అవే వచ్చి వారిని బంధించి బానిసలుగా  మారుస్తాయి. 

అప్పటి వరకూ వారికి కలుగని బాధ , నొప్పి మొదలవుతాయి.  అడుగులు ముందుకు పడవు, కొరడాలు వొంటిమీద చరుస్తూ ఉంటాయి దారిలో ముళ్ళు వాటంతట అవే పెరుగుతుంటాయి. వీచే గాలి మండిపోయే నిప్పు కణాలలాగా వీరిపైన విరుచుకు పడుతూ ఉంటుంది. వర్షం గాజు ముక్కల్లా శరీరాన్ని చీల్చేలా పడుతుంది. వారు పెట్టే కేకలు, కారే రక్తం లాంటి కన్నీరు నరకాన్ని గుర్తు చేస్తుంది. ఎవరు వారికి ఈ శిక్షని అమలు చేస్తున్నారో కూడా తెలియదు. అక్కడ ఉన్నవారందరూ బానిసలే. అక్కడి నుండి బయటపడే మార్గమే తెలిసేది కాదు. ప్రతీ క్షణం వారి నరకప్రాయమైన జీవితాలని తలుచుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఉన్న వారు ఈ ప్రపంచ వినాశనాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షిస్తూ ఉంటారు. 

వీరికి విచక్షణ ఉండదు, ఆలోచించే అవకాశం ఉండదు. వారిని ఈ సంకెళ్ళ నుండి విముక్తుల్ని చేసే వారు ఎవరైనా వస్తారా, అలాంటి వారు ఉన్నారా అని కూడా తెలియని అయోమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి భయంకరమైన ప్రదేశాన్ని ఊహించడం కూడా వణుకు పుట్టిస్తుంది. అలాంటి ఈ ప్రదేశానికి ఊహించని అతిధిలా ఎక్కడ నుండి ఊడిపడ్డాడో తెలియనట్టుగా వచ్చి పడ్డాడు. చూడటానికి అచ్చం వారిలాగే ఉన్నా అతనికి సంకెళ్ళు లేవు, అతను నడిచే దారిలో ముళ్ళు వాటంతట అవే మాయమైపోతున్నాయి, అతని మీద కొరడా దెబ్బలు తగలడం లేదు, చూడటానికి చాలా ఘంబీరంగా ఉన్నాడు. వీరి బానిస బ్రతుకులని, వారు పడే నరక యాతనని చూస్తూ అసలు ఎక్కడ ఉన్నాడో అర్థం కాక ఎర్రగా మారిన ఆకాశం వైపు చూసాడు. సూర్యుడు అస్తమించడం స్పష్టంగా తెలుస్తోంది. అక్కడి వారి ముఖ కదలికలు బాధ నుండి సంతోషంగా మారిపోతున్నాయి. అప్పటిదాకా రోదిస్తున్న వారంతా హా హా కారాలతో ఆనందంగా అరవడం కేకలు పెట్టడంతో అతని చెవులు చిల్లులు పడేలా అనిపించింది. 

అతను చూస్తుండగానే వారి సంకెళ్ళు ఒక్కొకటిగా తెగి నేల మీద పడిపోతున్నాయి, దీపాలు ఒక్కొకటిగా వెలుగుతున్నాయి, అక్కడకి  ఉన్న పాటుగా అతి సౌందర్యవంతులైన కన్నెలు ప్రత్యక్షమయ్యారు. ఇదంతా చూస్తూ అతని ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. వారి చేష్టలని చూసి ఏమని అర్థం చేసుకోవాలో అతనికి అర్థం కాలేదు. అతి భయంకరమైన బానిసత్వం నుండి అత్యంత సుఖవంతమైన జీవితం ఎలా సాధ్యం అన్నట్టుగా ఆలోచనలో పడ్డాడు.

అక్కడి వారికి ఇతనొక వింత మనిషిలా కనపడుతున్నాడు. వారికి కలిగే సంతోషం కాని, బాధ కాని ఇతనికి కలగడం లేదు. మద్యం ఏరులై పారుతున్నా అతను దానిని త్రాగడం లేదు. అంతటి సుందరీ మణులు కళ్ళెదుటే ఉన్నా అతను మోహించడం లేదు. వారి స్థితిని చూసి అంచనా వేయడం మొదలు పెట్టాడు. వారి శరీరాలు చూస్తే చాలా దారుడ్యంగా  ఉంది, ద్రుష్టి లోపం కాని, అంగ వైకల్యం కాని లేదు. ఒక్కొకరూ 9 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్నారు, జుట్టు బారులు తీరినట్టుగా నల్లటి రాత్రిని తలపించేలా ఉంది. దీపాలు వెలుగుతున్నాయి కానీ, వాటికి ఎటువంటి ఆధారం లేదు. మద్యం పొంగుతున్నా దానికి మొదలు ఎక్కడో తెలియడం లేదు. కన్యా మణులు  వేసే నాట్యాన్ని అతను ఇదివరకెప్పుడూ చూడలేదు. అక్కడ జరిగేవన్నీ విచిత్రంగా కనిపించినా ఏదో మాయలా అనిపించింది.

అతడి మనస్సులో ఇప్పుడు మొదలైన భావన ఒక్కటే, అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు , ఎలా వచ్చాడనే ఆలోచన మాత్రమే. 



............................ అతని ఆలోచనల గురించి, అతను ఇక్కడికి ఎలా వచ్చాడనే విషయాన్ని రేపటి భాగంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను.



" ధన్యవాదాలు "

                                                                                                                                           రచన

                                                                                                                                 రెడ్డి ప్రసాద్ మల్లెల



Comments

Trending