కరిష్యే వచనం తవా
బావిలో కప్పలా బ్రతికే నా భావోద్వేగాలకి
బయటపడే సమయం ఎప్పుడు వస్తుంది??
జరిగిన తప్పును తప్పు అని నిర్భయంగా చెప్పే కాలం ఎప్పుడు వస్తుంది?
నేను చెప్పిన మాటని ఈ ప్రపంచం విశ్వసించే రోజు ఎప్పుడు వస్తుంది?
కృత్రిమమైన ఆప్యాయతలకి అంతం ఎప్పుడు వస్తుంది?
వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఎప్పుడు లభిస్తుంది?
ఎటువంటి ఆలోచననైన సగర్వంగా వ్యక్తపరిచే రోజు ఎప్పుడు వస్తుంది?
నటనతో అవసరం లేని జీవితం ఎప్పుడు వరిస్తుంది??
జ్ఞాపకాలకి మరణం ఎప్పుడు వస్తుంది??
గతాన్ని మార్చగలిగే అవకాశం ఎప్పుడు సమకూరుతుంది??
భవిష్యత్ మీద నమ్మకం ఎప్పుడు కలుగుతుంది??
చింతనలేని రోజు ఎప్పుడు ఉదయిస్తుంది??
చిరస్థాయిగా కీర్తికి బదులుగా సంతోషం ఎప్పుడు వరిస్తుంది??
భేదభావం ఎప్పుడు మరణిస్తుంది??
మనసులోని కాఠిన్యం ఎప్పుడు నశిస్తుంది??
ఆలోచనలకు అస్తిత్వం ఎక్కడ దొరుకుతుంది??
కాటికి మోసే నలుగురి సహచర్యం ఎలా తెలుస్తుంది??
చివరికి మిగిలే మూల్యపు విలువ ఎలా నిర్ణయమవుతుంది??
నేను అనే ప్రశ్నకి నీవు అనే సమాధానం ఎవరి దగ్గర దొరుకుతుంది??
గర్వానికి కారణం ఎలా దూరమవుతుంది??
అధర్మానికి అంతం ఎప్పుడు ఆవిష్కృతమవుతుంది??
నాలోని భయం నన్ను ఎలా వదిలిపోతుంది??
నాకున్న బలం నా బలహీనతగా ఎందుకు మారుతుంది??
నాదన్న ఐశ్వర్యం ఎప్పుడు నాకు దక్కుతుంది??
నేనన్న మూర్కత్వం ఎలా గుర్తించబడుతుంది??
నావారు ఎవరో ఎలా తెలుస్తుంది??
నాకున్నదేదో ఎప్పుడు దూరమవుతుంది??
ఇదంతా నాకెప్పుడు అర్థం అవుతుంది??
ఈశ్వరా నీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది??
అసలు ప్రశ్న అది కాదు అసలు కలుగుతుందా??
నిన్ను ఎలా చేరుకోవాలి??
నువ్విచ్చిన ఈ జీవితానికి అర్థమేమిటో ఎలా తెలుసుకోవాలి??
నీ కరుణా కృపా కటాక్షాలు ఏవిధంగా అందుకోగలను??
పరమేశ్వరా... పరందామా... పురుషోత్తమా...
" కరిష్యే వచనం తవా " ఇవి నరుడైన అర్జునుడు నారాయణుడైన కృష్ణుడితో అన్న మాటలు అంటే సర్వదా నీవు చెప్పిన మాటలనే శిరోధార్యంగా భావిస్తాను అని చేసిన వాగ్దానం అది. అలాగే నేను ఈరోజు అదే విధంగా నా జీవితాన్ని నీ పాదాల చెంత ఉంచి కరిష్యే వచనం తవా ఈ క్షణం నుండి నీవే నా మార్గదర్శనం, నీవే నాకు దయ, నీవే నాకు ఆజ్ఞ, నీవే నాకు ఐశ్వర్యం, నీవే నాకు సమస్తం నీ మాటే నాకు మహద్భాగ్యం...
ఈ అసమర్థుడి జీవితానికి ఒక అర్థం చూపించు తండ్రి..
నీవే రక్ష నీవే శిక్ష..
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment