తెలుసుకోవాలి

ఏదైనా మొదలపెట్టాలి అంటే దానికో స్థానం అవసరం.
కానీ, మొదలైన దాని మూలం తెలుసుకోవాలంటే
ఎక్కడ నుండి మొదలు పెట్టాలి???
గాలికి వేగం
నీటికి ప్రవాహం
నేలకు స్థిరమైన భ్రమణం
అగ్నికి విరుచుకుపడే స్వభావం
ఆకాశానికి అంతులేని దూరం
వీటిని ఈ విశ్వం పంచభూతాలుగా విభజించింది.
కానీ, ఇక్కడ ప్రశ్న వీటికున్న ప్రాముఖ్యత గురించి కాదు.
అసలు వీటినే ప్రామాణికంగా ఎందుకు ఎంచుకుంది???
సప్త జన్మలు
సప్త ఖండాలు
సప్త సముద్రాలు
సప్త గిరులు
సప్త వర్ణాలు
సప్త ఋషులు
సప్త సహచరులు ( మనిషిని పోలిన మనుషులు )
ఇలా ఈ ప్రతి విభజనలోనూ సప్త శబ్దాన్ని ఎందుకు ఎంచుకుంది???
ఆశకు నిరాశని తోడు పంపింది
పగటికి రాత్రిని
వెలుగుకి చీకటిని
గెలుపుకు ఓటమిని
ఒప్పుకు తప్పుని
నిజానికి అబద్ధాన్ని
సుఖానికి కష్టాన్ని
ఓర్పుకి అసహనాన్ని
పురుషుడికి స్త్రీని
ఇలా అన్నింటిలో ఒకే రకమైన ద్వయం అంటే రెండు అనే జతని ఎందుకు ఎంచుకుంది???
మొక్కలు
వృక్షాలు
క్రిములు
కీటకాలు
పక్షులు
జంతువులు
మనుష్యులు
ఒక దానితో ఒకటి ఆధారం చేసుకునే అవసరం ఎందుకు ఏర్పడింది???
శ్వాశకి వాయువుని
దాహానికి జలాన్ని
బ్రతకడానికి భూమిని
దహించడానికి అగ్నిని
కలిసిపోవడానికి శూన్యాన్ని ఎందుకు ఎంచుకోబడింది???
సూర్యుడు ఉంటే పగలని
చంద్రుడు రాగానే రాత్రని
తూర్పు పడమరల దిశా నిర్ధేశాలని
ఉత్తర దక్షిణ ధృవాలని ఎలా నిర్ధారించారు???
కుడి ఎడమల భేదం ఎందుకు
ముందు వెనుకల లౌక్యం ఎందుకు
జనన మరణాల తర్కం ఎందుకు
పాప పుణ్యాల ప్రస్తావన ఎందుకు
మనిషికి మనసు ఎందుకు
మనసుకి మలినం ఎందుకు
కోపం ఎందుకు
ప్రేమ ఎందుకు
సుఖం ఎందుకు
దుఃఖం ఎందుకు
మోసం ఎందుకు
ద్రోహం ఎందుకు
పని ఎందుకు
ఫలితం ఎందుకు
కష్టం ఎందుకు
కన్నీళ్లు ఎందుకు
ఎందుకని ప్రశ్నించే ఆలోచనలు ఎందుకు
గెలవాలనే పట్టుదల ఎందుకు
ఒడిపోయాననే పరాభవం ఎందుకు
చూసే కళ్ళెందుకు
వినే చెవులెందుకు
చెప్పే మాటలెందుకు
ఆలోచించే మెదడెందుకు
వీటినే విధి ఎందుకు ఎంచుకుంది???
కారణం ఏమిటి
అవసరం ఏమిటి
సందర్భం ఏమిటి
సమస్య ఏమిటి
అసలు వీటి వల్ల ఉపయోగం ఏమిటి
వీటిని ఎంచుకునే నిర్ణయం ఎవరిది???
ఊహలు ఎందుకు
కల్పనలు ఎందుకు
కీర్తనలు ఎందుకు
కీర్తి ప్రతిష్టలు ఎందుకు
కళలు ఎందుకు
కఠినమైన శ్రమలు ఎందుకు
కవ్వింపులు ఎందుకు
కొని తెచ్చుకునే కారు చిచ్చులు ఎందుకు
మౌనం ఎందుకు
మాట్లాడే మూర్కత్వం ఎందుకు
జీవం ఎందుకు
ప్రాణం ఎందుకు
శరీరం ఎందుకు
ఆత్మతో మమేకం ఎందుకు
అసలు ఇవన్నీ ఎందుకు ఎవరు కోరుకున్నారు???
ఎవరు నిర్ణయించారు???
ఎందుకు ఎంచుకున్నారు???
విశ్వాన్ని నడిపేదెవరు???
లోకాన్ని ఏలేదేవరు???
కారణాలు ఏంటి???
అసలు ప్రశ్న, ఎవరిని ప్రశ్నించాలి???
ప్రశ్న అనే పదానికి ప్రారంభం ఎక్కడ???
ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ???
నాకు ఈ సందేహాలు ఎందుకు???
వీటి వెనుక ఉన్న సందేశం ఏమిటి???
తెలుసుకోవాలి....

Comments

Trending