నా ఈ ప్రేమ లేఖ






నన్ను కలిసే నీకు, 
నిన్ను వెతికే నేను... 
వినిపించని దూరాలకి, కనిపించని తీరాలకి తెలిసేలా, నిన్ను చేరుకునే రోజుకోసం నిరీక్షణగా చూస్తున్న నా కలల్ని ఈ కలంతో నింపి నీకోసం వ్రాస్తున్న నా ఈ ప్రేమ లేఖ....

నాలో సగమై నిలిచే సఖియా,

నువ్వు క్షేమంగా ఉన్నావని, ఉండాలని నా అభిలాష. ఎందుకంటే, నువ్వు కుషలంగా ఉన్నావని తెలిసినప్పుడు కలిగే సంతోషం కన్నా, నువ్వు క్షేమంగా ఉన్నావని విన్నప్పుడు కలిగే ధైర్యమే నా మనసుకి ఎక్కువ ప్రశాంతతనిస్తుంది. నా జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమో నేను మాటల్లో చెప్పలేను. నిన్ను కలిసే తరుణం కోసం, యుగాలని క్షణాలుగా మార్చి తరించబోయే నిమిషానికై తపించిపోతున్నాను.

ఎలా మొదలైనా ప్రతి కథకి, ప్రతి నిరీక్షణకి ఓ ముగింపు ఉంటుంది. కాలం ఎంత కష్టపడినా, దూరం ఎంత ద్రోహం చేసినా, నిన్ను చేరుకునే వరకూ నా పయనం ఆగదు ప్రాణం పోదు. ఆకులు రాలిన చెట్టుకి వసంతం వచ్చినట్టుగా, అలసిన నా ఆశలకి ప్రాణం పొసే నీ ప్రేమ తోడైంది. చీకటిలో వెలుగై నడిపింది, కష్టాన్ని ఇష్టంగా మార్చింది, కలలా మిగిలిపోవలసిన నన్ను ఒక కొత్త కథలా మలిచింది. వెలుగుని పంచే సూర్యుడైనా, చీకటిని తెంచే చంద్రుడైనా, తూరుపుతో మొదలై పడమరలో కలసిపోతారు. కానీ, నిన్ను వెతికే నేను మాత్రం నీ ఆశలతో మొదలై, నీ ఆలోచనలలో నిలిచిపోయాను, నీకై బ్రతుకుతున్నాను.

ఆశలు ఓడినా, శ్వాసలే ఆగినా నా గమ్యం నువ్వే. విశ్వమంతా ఒక్కటైనా, నిన్ను నా నుండి దాచలేదు. ఈ ప్రపంచం మొత్తం పోటీ పడినా, నీకోసం నేను చేసే పోరులో గెలవలేదు. ఇది నిజం నువ్వు నాకు సొంతం. తరాలు మారినా, చరిత్రలు మార్చి రాసినా, నిన్ను చేరుకోకుండా నన్ను ఆపగలిగే శక్తి ఏదీ లేదు. అనంతమైన ప్రేమకి అచంచలమైన నా ఆశని తోడు చేసి, చేతులు చాచి నీకై వస్తున్నా. అపురూపమైన మన కలయిక కోసం, ప్రపంచాన్ని శాసించే పంచ భూతాలు సైతం స్వాగతం పలికేలా నిన్ను చేరుకుంటాను. 

ఇట్లు          
నిన్ను వెతికే నేను,
రెడ్డి ప్రసాద్ మల్లెల.

Comments

  1. Ee generation lo kuda intha goppaga premalekha rayadam adi meeku matrame sadhyam. Meeru tanani ippude intha la aaradistunnaru .aa ammai really so lucky. Bcz tanaki teliyakunda ne tana kosam intha la aaradhinche life partner tana life lo ki vastunnanduku . Me preyasi kosam meeru pade tapana appatiki vrudha avvadu . Tanu tvaralone meeku eduravutundi . Meeru me heart lo tanaki ala aiyite gudi kattaro me life lo ki kuda mimmalni anthala aaradhinche ammai ravalani heartfull ga korukuntunnanu .

    Itlu
    Me abhimani.

    ReplyDelete

Post a Comment

Trending