వైరాగ్యం

యవ్వనమనే ధనస్సుకి కామమనే బాణాన్ని సంధించి సరదాగా శిక్షలు విధించే సర్వాంతర్యామి నమోస్తుతే...
నా వల్ల కాదు అనగానే ఎందుకు కాదనే ప్రశ్నతో ఎదురొస్తావు
నేనే చేయగలను అనుకోగానే ఎలా చేస్తావో చూస్తాను అంటావు
మార్గమంతా ముళ్లే అని ఆగిపోతే పూలదారిని పరిచేస్తావు
ఇదేమంత కష్టం సులువుగా నడిచేస్తాను అంటే దారి నిండా ముళ్ళతో నింపేస్తావు..
నాకెవరు దిక్కు అని అడిగితే సదా తోడుంటావు
నాకేం తక్కువ అని ఆలోచిస్తే అంధకారంలోకి తోసేస్తావు
నువ్వు ఉన్నవో లేదో అని పరీక్ష పెడితే క్షణంలో ప్రత్యక్షమవుతావు
అదే నువ్వు పరీక్ష పెట్టాలని అనుకుంటే జీవితాన్ని తలక్రిందులు చేసేస్తావు
ఆడగలనా అని సందేహపడిన వాడికి గెలుపు రుచి చూపిస్తావు
నన్ను ఓడించే వాడెవడు అన్నవాడికి ఓటమిని చవిచూపిస్తావు
ఎక్కడున్నావని ప్రశ్నిస్తే ఎక్కడలేనని తిరిగి ప్రశ్నిస్తావు
ఇక్కడికెందుకు రాలేదని అడిగితే మౌనంగా మాట దాటేస్తావు
ధర్మాన్ని గెలిపిస్తానని మాటిస్తావు
అధర్మం జరుగుతున్నా అలా వేడుక చూస్తావు
ఆపదలో శరణన్న వాడికి అభయ హస్తం చూపిస్తావు
ఆపధర్మం పేరు చెప్పి తప్పించుకుంటావు
నేనేది కోరుకున్నా నీది కాని దానిపైన మోహం వద్దంటావు
నాదనుకున్నది దూరమవుతున్నా చూసి భరించమంటావు
నీ కోపమే నీ శత్రువు అని భోధిస్తావు
అవతల వాడి కోపానికి బలి అవుతున్నా అంతా నేనే చేసుకున్నానంటావు
ఆశల వలలు వేయిస్తావు ఆశపడితే నిరాశ తప్పదంటావు
ఆకలి కోసమే జీవితం అని నమ్మిస్తావు
ఆకలి చావుల కేకలు వింటూనే నిద్రిస్తావు
మోక్షం కోసం మార్గాలని సూచిస్తావు
మరణ భయంతో బ్రతకమంటావు
స్వామి అన్నవాడికి సాయంగా నిలబడుతానంటావు
సాయం పొంది మోసం చేసినవాడికి ఐశ్వర్యాన్నిస్తావు
తాతకి మనవరాలి వయసున్న వారిపై కామవాంఛ కలిగిస్తావు
అలాంటి నీచులకి అండగా శ్రీ లక్ష్మిని కూర్చోబెడుతావు
అయ్యో రామా అంటే అయ్యయో ఇదేమి జీవితంరా భగవంతుడా అనిపిస్తావు.
నీయమ్మా అన్నవాడికి ఇదిరా జీవితం అనేలా ఆనందాన్ని ఇస్తావు
నేనేది అనుకుంటే దాని దారి తెన్నులు మార్చేస్తావు
నేనేది చెయ్యాలో దానికి నా కర్మని వదిలేస్తావు
పాపమనే ప్రతీది నాతో చేయిస్తావు
పుణ్యమెక్కడ చేశావని లెక్కలు వేస్తావు
అర్థం కాలేదని అడిగితే అసలు శ్రద్ధ పెడితే కదా అని నింధిస్తావు
అర్థమయ్యేలోపే అంతకు మించిన చిక్కు ప్రశ్నని అల్లేస్తావు
అర్థమేకాని ప్రశ్నవి నీవే సమాధానం కోసం వెతికే మూర్కుడిని నేనే
సమస్యలకి ఆధారం నీవే వాటి సాలోచనకి శ్రీకారం నీవే
బంధం నీవే బంధ విమోచనం నీవే
కష్టం నీవే కష్టాన్ని తొలగించే మార్గం నీవే
శిక్షించే శక్తివి నీవే రక్షించే ప్రేమవి నీవే
అవసరం కోసం అడగడం కన్నా ఆవేశంతో ప్రశ్నించడం కన్నా
అసలైనది ఏది అనే ఆలోచనే నిన్ను దగ్గర చేసుకోగల మార్గం 
ఇదే నీ సూత్రం ఇదే జీవితానికి అర్థం
మహానుభావా మళ్లీ మళ్లీ నీ ప్రశ్నల సుడిలో తిరిగే అవకాశం కావాలి
పదే పదే నిన్ను వేడుకునే కష్టం కలగాలి
సమస్యలతో సతమతమయ్యే సమయం రావాలి
సుదీర్ఘమైన ఆలోచనల వలలో చిక్కుకు పోవాలి
అదే పనిగా అర్థంలేని విధంగా ఆపదల మధ్యలో నలిగిపోవాలి
నిత్యం నీ నామం తలుచుకోవాలి
నిన్ను స్మరించుకోవాలి
నిన్ను శరణు వేడాలి
నీ సాయం పొందాలి
ఆహా స్వామి నన్ను రక్షించేందుకు వచ్చావా తండ్రి అని నీ పాదాలను పట్టుకుని పూజించాలి
ప్రయత్నపూర్వకంగా నిన్ను నాలో నింపుకోవాలి
నిమిషం నిమిషం నిన్నే తలుచుకోవాలి
నేను తరించిపోవాలి
నన్ను నీ దరికి చేర్చుకో తండ్రి చేర్చుకో...
నిన్ను అనునిత్యం నాలో నింపుకోగల భాగ్యం కలిగించు ఇదే నా ప్రార్థన అనుకో పూజ అనుకో నైవేద్యం అనుకో నివేదన అనుకో నిర్ణయం అనుకో ఏదైనా పర్వాలేదు నన్ను నీలో కలుపుకో... కలుపుకో...


                                " ధన్యవాదాలు "

                                        రచన
                                రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending