ఇలా బ్రతకాలని ఉంది..
పారిపోవాలని ఉంది, పరిగెత్తే అవసరంలేని ఆ ప్రపంచపు ఆనవాళ్ళని వెతుక్కుంటూ వెళ్లాలని ఉంది..
ఆగిపోవాలని ఉంది, అలసట తెలియని ఆనందపు అనుభవాల మధ్యలో నిలబడిపోవాలని ఉంది...
తరిమేయాలని ఉంది, తపించిపోయే తీరని కోరికల కొరడాల నుండి తప్పించుకోవాలని ఉంది...
క్షణమైనా ఆపని పనిలో పడిపోవాలని ఉంది,
నిజమైనా నమ్మని అబద్ధంలో బ్రతకాలని ఉంది,
వరమైనా అందని ఆకాశాన్ని తాకాలని ఉంది,
కలనైనా కలగని ఆనందాన్ని పొందాలని ఉంది,
ఏడుపొచ్చినా నవ్వాలని ఉంది,
విడిపోయినా ప్రేమించాలని ఉంది,
చచ్చిపోయినా బ్రతకాలని ఉంది,
ఉన్నదేదో ఉన్నంతవరకూ ఉండదేమో
అన్న భయం నుండి బయటపడాలని ఉంది,
తప్పు చేసినా క్షమించాలని,
నొప్పి వచ్చినా భరించాలని,
కష్టమొస్తే ఎదిరించాలని,
ఇష్టమేదో గ్రహించాలని,
అలా అని ఇలా అని,
ఎలా చెయ్యాలో అర్థంకాని,
అదే అదే అని ఆశపడి, ఆఖరికి అందలేదని బాధపడే
అనవసరపు ఆలోచనల నుండి అలసిపోవాలని ఉంది..
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment