నిలిచిపోయాను..
జీవితం ఏమిటో రోజు రోజుకి అర్థం కాకుండా పోతోంది..
బ్రతకడమే కష్టమైన రోజులు
బ్రతికినా ఉపయోగంలేని మనుషులు
కొంచెం కూడా ఆత్రం ఆపుకోలేని మూర్ఖులు
అవసరానికి తగిన మాటలు
ఆలోచించే అవసరమే లేని పనులు
స్వార్థం కోసం సృష్టించే సమస్యలు
ఆకలి కోసం అనుసరించే అడ్డదారులు
మోసం చేస్తున్నారని చేసే ఆరోపణలు
అవసరం రాగానే ఆ మోసమే చేసే ఆలోచనలు
అంతం అంటూ లేని ఆశలు
ఆశల చుట్టూ తిరిగే అవసరాలు
అవసరాల కోసం చేసే మోసాలు
మోసం చేసి చెప్పే అబద్ధాలు
అబద్ధాన్ని దాచే అవకాశాలు
అవకాశం చూసి దెబ్బ కొట్టే శత్రువులు
శత్రువులకు కూడా తీసిపోని స్నేహితులు
దారుణమైన సంఘటనలు
సంఘం సిగ్గుతో తల దించుకునే దారుణాలు
దూరాశతో చేసే దోపిడీలు
దోచుకుని పోగొట్టుకున్న విలువలు
విలువలేని మాటలు
మాటల వల్ల చెదిరే మనసులు
మనసుకి కలిగే గాయాలు
గాయం నేర్పే పాఠాలు
పాఠం వల్ల మారే మనుషులు
మనిషిగా మారే నిమిషాలు
మళ్లీ మృగాన్ని చేసే అనుభవాలు
అనుభవం ఉన్నా క్రింద పడేసే ఎదురు దెబ్బలు
దెబ్బలు తింటూ పైకి లేవాలని చేసే ప్రయత్నాలు
ప్రయత్నించే ప్రతిసారి క్రిందకి లాగేసే పశువులు
పశువులు కూడా చూసి సిగ్గుపడే జీవితాలు
ఇదే నాకు అర్థంకానిది, ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు ఒక మహా కవి అది నిజమే నేను గర్వంగా భావించే ఒక్క విషయం కూడా లేని ఈ జీవితంలో నాకు మిగిలేది ఏమిటి?? దేనికోసం నా ప్రేలాపన?? దేని కోసం నా నిరీక్షణ?? ఇలా అన్నీ ప్రశ్నగానే మిగిలిపోయే ఆలోచనల మధ్య నలిగిపోతూ నిలిచి పోయాను..
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment