జీవంలేని మాటలు

మౌనం నిండిన మాటలను మోయడం చాలా కష్టం..
ప్రాణంలేని శరీరం పొలికేకలు పెట్టినా ఎవ్వరికీ వినపడనట్టు
జీవంలేని మాటలతో జీవితం గురించి చెప్పాలనుకున్నాను....
జన్మతః అంధుడైన వాడికి అద్భుతం అనిపించే అందాలేవి కనిపించవు కానీ, అలాంటి అందాన్ని చూసిన తరువాత అంధకారంలో ఉండటం చాలా కష్టం.
నిన్ను చూస్తూ, నీకోసం వెతికిన క్షణాలలో నాకు కలిగిన ప్రతి భావం ఒక అద్భుతం. నిన్ను చూడలాని నా మనసు వెతికిన ప్రతిసారి, నువ్వు ఎదురుపడే క్షణాల కోసం నా నిరీక్షణ కూడా చాలా ఆనందంగా అనిపించేది. కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా నీ జ్ఞాపకాలను మరిచిపోవడం నాకు అంత సులభం కాదని అర్థమైంది. ఆకాశం వైపు చూస్తూ నాలో నేను నీ ఆలోచనల్లో మిగిలిపోయిన ప్రతి క్షణం నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది, ఎలా నీ వైపు నడిచే నా అడుగులు నిలిచిపోయాయో, ఎలా నీకోసం పలికే నా మాటలు మూగబోయాయోనని..
నీకు ఇష్టంలేదని దగ్గరగా ఉన్న నా ప్రేమని దూరంగా పెట్టాను, నాకు ఇష్టంలేని ఈ బాధకు దగ్గరగా చేరాను. బలవంతంగా చేసే ఏ పనిలోనైనా బాధే మనకి మిగిలే మజిలీ అని అర్థం చేసుకున్నాను. ఫలితం తేలని పరీక్షలు రాయగలమేమో కానీ, పరీక్షపెట్టే ఫలితాలని అంగీకరించడమే చాలా కష్టం. నీతో కచ్చితంగా ఉంటానన్న నమ్మకం లేనప్పుడు కష్టం అనిపించేది కాదు కానీ, నీకు కచ్చితంగా దూరంగా ఉండాలని తెలిసినప్పుడు మాత్రం తట్టుకోలేకపోయాను.
ఇది ప్రేమని చెప్పడానికి నా దగ్గర ఇంతకన్నా మాటలు లేవు, ఇదే ప్రేమని నువు నమ్మడానికి ఇంకెంత కాలం పడుతుందో తెలియడం లేదు. కాలం అన్ని సమస్యలకి సమాధానం చెప్తుంది అని అంటారు, కానీ ఇదే నీ సమస్య అని ఎవరు చెప్తారు?? సమాధానం దొరికిందో లేదో తెలియాలంటే అసలు సమస్యేంటో తెలియాలి కదా. అలాగే, నా జీవితానికి నీ పరిచయానికి ఉన్న సంబంధం ఏమిటో తెలియాలి. అప్పుడే నిన్ను ఒక జ్ఞాపకంగా మిగుల్చుకోవాలో, మిగిలిన ఈ జీవితాన్ని నీతో పంచుకోవాలో తెలుస్తుంది...


                                     " ధన్యవాదాలు "

                                            రచన
                                    రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending