ఇంతేనా
నిషీదిలో నిలిచిపోయిన పగలు,
నిరంతరం వెలిగిపోతున్న రాత్రి ని చూస్తున్నాను..
నిర్ణయించే కళ్ళు,
నిద్రపోతున్న మెదడుని నిత్యం గమణిస్తున్నాను..
నిలకడలేని బాల్యం,
నీరసమైన యవ్వనం,
నాది కాని వృద్దాప్యంలో ప్రపంచాన్ని పరిశీలిస్తున్నాను..
నిమిషానికొకలా మారే నిజాన్ని నమ్మలేకపోతున్నాను..
నా తప్పుల నుండి తప్పించే అబద్ధాలకే తప్పక ఓటు వేస్తున్నాను..
నాదే తప్పని తెలిసినా నిజాన్ని కప్పేసే ప్రయత్నమే కొనసాగిస్తున్నాను..
నిర్లజ్జగా నీచాతి నీచమైన ఆలోచనల ఊబిలో పడిపోతున్నాను..
ఇదేనా జీవితం అని ప్రశ్నించిన ప్రతీ సారీ కాదన్న సమాధానం వినబడుతున్నా మళ్లీ మళ్లీ అదే దారిలో పయనిస్తున్నాను..
అదేంటో మనసుకి కూడా ఈశ్వరా అనడం ఇష్టంలేదు, ఆశరా అంటే ఆగడంలేదు..
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment