నువ్వుంటే బాగుండేది
నువ్వుంటే బాగుండేదని అనుకోని క్షణం లేదు,
నీకోసం కలలు కనని రాత్రికి నిదుర లేదు,
నీ ఆలోచనల వ్యసనంలో మునిగిపోని రోజు లేదు.
ఒంటరిగా ఉన్న సమయాలు
నీ నవ్వుల జ్ఞాపకాలతో నిండిపోతున్నాయి,
ఒంటరితనం గుర్తుకొచ్చిన నిమిషాలు
నాపైన కోపంతో,
నిన్ను పొందలేదన్న పశ్చాత్తాపంతో మిగిలిపోతున్నాయి.
నదిలా కొనసాగే నీ తలపుల ఉప్పెనలో తలమునకలు అవుతున్నా,
నడి దారిలో నీతో నడిచిన గురుతులు కనపడితే
నన్నే నేను కోల్పోతున్నాను.
రెప్పలు పడని స్వప్నంలో,
రంగులు అద్దిన చీకటిలో ,
కనిపించను అంటూ నువ్వు ఉడికిస్తున్నా,
తరిమే తపనతో తరించిపోయే ప్రేమకై నీవెంటే వస్తున్నా..
అంది అందని అందం నువ్వై నన్నే వెళివేస్తున్నా,
ఆకాశానికి నిచ్చెన వేసే ఆశని నేనై నిన్నే కోరుకుంటున్నా..
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment