నా బంగారం
ఒప్పుకోలేదు అలా అని తప్పు అనలేదు
వదిలిపోలేదు జంటగా కలవనూ లేదు
కలగా కనిపించినా
నిజమై ఎదుట నిలిచింది
భావం తెలిపే భాగ్యం కలిగింది
అర్థం చేసుకునే హృదయాన్ని చేరుకుంది
అవకాశం లేదని బదులు తెలిపింది
ఆశపడినా హద్దులు చెరిపినా మౌనంగా ఊరుకుంది
అదుపుతప్పితే దారిలో పెట్టి మార్గం చూపింది
అద్భుతంలా అనిపించింది
జన్మకి దొరికిన గొప్ప వరంలా కలిసింది
నా మనసుని పట్టి గిలిగింతలు పెట్టింది
సంతోషం రుచి చూపించింది
సమయం ఎలా గడిచిపోయిందో అర్థం కానంది
ఎంత సమస్య ఎదురైన చిన్నదిగా తోచింది
చిరునవ్వు విలువ తెలిసొచ్చింది
ఆ నవ్వుల్లోనే జీవితం ఉందని అర్థమైంది
సిరిమువ్వలా చిందులు వేసింది
మధురమైన పాటలా వినిపించింది
కుదురులేని పరుగులు తీయించింది
కలలు కథలు మాత్రమే తెలిసిన నాకు
కమ్మని ప్రేమని పరిచయం చేసింది
అల్లరి చేసింది
అడుగడుగునా అందమైన జ్ఞాపకాలని ఇచ్చింది
అనుకోగానే ఎదురైంది
అనిపించగానే అలా మనసులో నిండిపోతుంది
ఉంది ఉంది అనేలా ప్రేమించే గుణమైంది
ఉందొ లేదో అనేలా నాలో స్వార్థాన్ని చంపేసింది
ఒక క్షణం ఊరిస్తుంది
మరుక్షణం ఉరకలు వేయిస్తుంది
క్షణక్షణం గుర్తొస్తుంది
అనుక్షణం నా గుండెల్లో నిలిచిపోతుంది
ఇన్ని మాయలు చేసినా అమాయకంగా అనిపిస్తుంది....
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment