ఆఖరి మజిలీ 1
XXXXXX,
ఎవరని అడగకు నేను చెప్పలేను, ఎందుకని నువ్వు అడిగినా నా దగ్గర సమాధానం లేదు.
మౌనంతో స్నేహం చేసే నీకు, మాటలని ప్రేమించే నా భావం అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అలా అని నీకు ఎదురుపడి ఆ మాటలు చెప్పాలంటే నాకున్న ధైర్యం సరిపోదు. అందుకే నిన్ను తలుచుకునే ప్రతి క్షణాన్ని ఒక అక్షరంగా మార్చి, అందమైన నా ఆశల్ని మాటలుగా మలిచాను.
అల్లరిగా సాగిపోయే నా జీవితానికి, కనిపించిన అద్భుతం నువ్వు. అందమైన నా కలలకి రూపం నువ్వు. చ్చా... ఈ దూరానికి అత్యాశ ఎక్కువ కదా, అందుకే నిన్ను నాకు ఇంత కాలం దూరంగా ఉంచింది. కానీ, ఇక దాని ఆటలు సాగవని తెలియదు పాపం.
నిన్ను చూడాలని కలిగే ఆశలకి,
నిన్ను కలుసుకోవాలనే ఆతృతకి,
అనుక్షణం నిన్ను వెతికే నా కళ్ళకి,
అతిశయం అనిపించినా,
అణువణువునా నిన్ను నింపుకున్న నా మనసుకి,
అనువైన వేళలో, అరుదైన చోటులో..
అల్లరిగా నువ్వు ఎదురవుతావని ఎలా చెప్పను??
ఒక్క మాటలో చెప్పనా, నేను నాది అనగలిగేది ఏదైనా ఉందంటే అది నువ్వే.
ఇట్లు
- నీ ఆఖరి మజిలీ
" ధన్యవాదాలు "
రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల
Comments
Post a Comment