గుర్తున్నాయి

నచ్చినవన్నీ చేయాలనుకుని, ఎవడేమనుకుంటాడో అని ఆలోచించి ఆగిపోయిన రోజులు ఇంకా గుర్తున్నాయి..
నాన్నకి నచ్చదని, అమ్మ ఆడిగిందని, స్నేహితులు కాదన్నారని, ప్రేయసి అలిగిందని
ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని ఇంకొకరి చేతిలో ఆటగా మార్చుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి..
అవసరం లేని కోపానికి బానిసనై అర్థంలేని ఆలోచనలకు సమయం ఇచ్చి బయటపడే అవకాశం లేని
బలవంతపు బ్రతుకుకి సంబంధించిన ఆనవాళ్లు ఇంకా గుర్తున్నాయి..
అడిగితే కాదనలేని, అవసరమైనది అడగలేని అసమర్ధపు ఆశల కేకలు ఇంకా గుర్తున్నాయి...
చేతకాని చవటలా ఆడదాని అందానికి లొంగిపోయి అదుపులేని కామవాంఛతో
అరుదైన నా వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టిన రోజులు ఇంకా గుర్తున్నాయి..
నా ఆలోచనని, స్థాయిని, వ్యక్తిత్వాన్ని, కోపాన్ని, ఆఖరికి ప్రేమని కూడా మరొకడితో పోల్చి
తక్కువని చూపించి, నేర్పించిన పాఠాలు ఇంకా గుర్తున్నాయి..
మారమని సలహాలు ఇస్తూనే, మారడానికి అవకాశమే లేని ఆలోచనలకు కారణమైన
మనుషుల మాటలు ఇంకా గుర్తున్నాయి..
మాటకి ముందు, వెనుక నాకున్న బలహీనతలను గుర్తుచేసే అసహ్యకరమైన చూపులు ఇంకా గుర్తున్నాయి..
తగిలిన గాయాలు, హృదయం పగిలిన సమయాలు, మనసు నొచ్చుకున్న మాటలు,
జీవితం మొత్తం గుర్తుండే అవహేళనలు అన్నీ ఇంకా గుర్తున్నాయి..
నా ముందు కనీసం నిలబడి సమాధానం చెప్పలేని వాడు కూడా
నేనెలా చేస్తే బాగుంటుందో సలహాలు ఇచ్చిన సందర్భాలు ఇంకా గుర్తున్నాయి..


" ధన్యవాదాలు "

రచన
రెడ్డి ప్రసాద్ మల్లెల

Comments

Trending